అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్ వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధిం చిన వివాదాస్పద రువాండా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధాన మంత్రి రిషి సునాక్ అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్ రాజు చార్లెస్ ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టాం. దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్ గ్యాంగ్‌ల కార్యకలాపాలను అడ్డుకట్ట పడుతుంది. ఇకనుంచి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదు. ఇక మా దృష్టి వారిని విమానాల్లో తరలించడం పైనే. దీనికి ఇప్పుడు ఏదీ అడ్డుకాదు అని సునాక్ పేర్కొన్నారు.