ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టిబెట్ పీఠభూమి తూర్పు అంచున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల దిగువనున్న భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన లక్షలాది మంది ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. యార్లంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతాన నిర్మించే ఈ డ్యామ్ ద్వారా ప్రతి ఏడాది 300 బిలియన్ కేడబ్ల్యూహెచ్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని చైనాకు చెందిన పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దదైన సెంట్రల్ చైనాలోని త్రీ గోర్జెస్ ఆనకట్ట ప్రతిఏడాది ఉత్పత్తి చేసే 88.2 బిలియన్ కేడబ్ల్యూహెచ్ కన్నా ఇది మూడు రెట్లు. అయితే ఈ ప్రాజెక్టు కారణం గా ఎంతమంది నిర్వాసితులవుతారు, పర్యావరణ వ్యవస్థకు కలిగే నష్టానికి సంబంధించిన వివరాలను చైనా వెల్లడించ లేదు.