
రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఇది మంచి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే దీనిపై సమగ్రమైన వివరాలు తెలియదన్నారు. ఇక ముందు రష్యా నుంచి ఇంధనాన్ని ఇండియా దిగుమతి చేసుకోదన్న వార్తలు వినిపించాయని, దాంట్లో ఎంత వాస్తవం ఉందో తనకు తెలియదని, ఒకవేళ అదే నిజమైతే అది మంచి నిర్ణయమని, దీనిపై పునరాలోచన చేస్తామని ట్రంప్ అన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రకారం ఇండియాపై 25 శాతం పన్ను పడనున్నది. అయితే రష్యా నుంచి సైనిక వస్తువులు, ఇంధనాన్ని కొనుగోలు చేస్తే భారత్‌పై పెనాల్టీ వేస్తామని ట్రంప్ అన్నారు. కానీ ఎంత పెనాల్టీ కట్టాలన్న దానిపై ఆయన ఏమీ క్లారిటీ ఇవ్వలేదు.
















