అమెరికాలో స్థిర నివాసం ఎక్కువమంది ప్రవాస భారతీయుల కల. దీనికోసం జారీచేసే గ్రీన్‌కార్డు కోసం వేలాదిమంది ఎన్ఆర్ఐలు సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో మనవాళ్ల కలను మరింతగా సాకారం చేసే కీలక అడుగు పడనుంది. ప్రస్తుతం ఏటా 1,40,00 గ్రీన్‌కార్డులు జారీ అవుతున్నాయి. వలస విధానంపై బైడెన్ ప్రభుత్వం స్థాయిలో జరుగుతున్న కసరత్తు ఫలిస్తే, ఈ సంఖ్య మరికొంత పెరగవచ్చు. గతంలో జారీచేసిన గ్రీన్‌కార్డుల్లో వాడుకలో లేనివాటిని వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుని సలహామండలి యోచిస్తోంది.ఇవన్నీ కుటుంబ, ఉద్యోగ సంబంధంగా జారీచేసిన కార్డులు. అలాంటివి 1992 నుంచి 2022 మధ్యకాలానికి సంబంధించి 2,30,000 వరకు ఉంటాయని అంచనా. వీటిని వెనక్కి తీసుకుని, ప్రతి సంవత్సరం కొన్ని చొప్పున వీటిని పునఃపంపిణీ చేయాలని సలహా మండలి సూచించింది.


ఈ నిర్ణయం అమలైతే మనవాళ్లకు గ్రీన్‌కార్డు జారీ గతంతో పోల్చితే మరింత సులువు కానుంది. అధ్యక్షుని సలహామండలిలో (ఆసియా సంతతి అమెరికా పౌరులు, నేటివ్ హవాయివాసుల, పసిఫిక్ ద్వీపకల్పవాసుల వ్యవహారాలు) సభ్యునిగా ఉన్న భారతీయ సంతతి అమెరికా పౌరుడు అజయ్ భుటోరియా తాజా సిఫారసు చేయడం గమనార్హం. వాడుకలో లేని గ్రీన్‌కార్డుల జఫ్తు భవిష్యత్తులో దుర్వినియోగానికి అడ్డుకట్ట’ అనే పేరిట ఆయన ఈ సిఫారసును ప్రతిపాదించారు.
