కరోనా లాంటి మరో వైరస్ అమెరికా నుంచి రావొచ్చునని తాజా అధ్యయనం ఒకటి అంచనా చేసింది. ఇతర దేశాల నుంచి జంతువుల దిగుమతి, పశువుల తరలింపు, వధకు సంబంధించి అమెరికాలో కట్టుదిట్టమైన నియంత్రణ లేదని, ఫాంహౌజ్‌ల్లో పనిచేసే వారు జునోటిక్స్ (జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులు) బారిన పడే అవకాశముందని, అనంతరం ఇది కరోనా వంటి మహమ్మారిగా మారే ప్రమాదముందని హార్వర్డ్ లా స్కూల్, న్యూయార్క్ వర్సిటీ అధ్యయనం పేర్కొన్నది. అమెరికాలో పందులు, కోళ్ల ఫామ్‌లు, పశువులు, క్రూర మృగాలకు సంబంధించి మార్కెట్లపై సరైన నియంత్రణలు, నిబంధనలు పాటించటం లేదని అధ్యయనం తెలిపింది. నివేదిక రూపకల్పనలో ఒకరైన యాన్ లిండర్ మాట్లాడుతూ జునోటిక్స్ ముప్పు అమెరికాకే ఎక్కువ. కోళ్లు, పశువుల పెంపకం జనాల మధ్యలోకి వచ్చింది. క్రూర మృగాల క్రయవిక్రయాలు, దిగుమతి, తరలింపు సమయాల్లో హెల్త్ చెకప్‌లు చేయటం లేదు. కాబట్టి ప్రమాదకర వైరస్ మానవులకు సోకే అవకాశముంది అన్నారు.
