అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతివలు అధిరోహించే అవకాశం మరోసారి చేజారింది. 248 ఏండ్ల ఆ దేశ ప్రజా స్వామ్య చరిత్రలో మహిళలెవరూ ఈ స్థానాన్ని ఒక్కసారి కూడా చేజిక్కించుకోలేక పోయారు. 2024 అధ్యక్ష ఎన్నికలతో ఆ కల నెరవేరుతుందని చాలామంది భావించినా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయానికి చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. గతంలో కూడా అమెరికా అధ్యక్ష స్థానానికి కొంతమంది మహిళలు పోటీపడినా ఎవరూ విజయం సాధించలేక పోయారు. మార్గరేట్ చేస్ స్మిత్, షెల్లీ చిసమ్ అధ్యక్ష పీఠానికి పోటీపడ్డారు. 2016లో హిల్లరీ క్లింటన్ విజయానికి చేరువగా వచ్చి ఓటమి చెందారు. అప్పటి ఎన్నికల్లో ఆమె ట్రంప్ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ పొందారు. కానీ ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు మెజారిటీ దక్కలేదు.