అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హాంగ్‌కాంగ్‌లో హ్యాపీ వ్యాలీ హిందూ టెంపుల్, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. హాంగ్‌కాంగ్‌లోని ఇండియన్ కాన్సూల్ కె. వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, రామనామ సంకీర్తనలతో దేవాలయం మారుమోగిపోయింది. కార్యక్రమానికి హాజరైన వారందరూ రామభక్తి పారవశ్యంలో ఓలలాడారు.

క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ సుందర్ రాజన్ నేతృత్వంలో స్థానికంగా లభించే వస్తువులతో తయారు చేసిన అయోధ్య రామమందిరం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ పాత్రల్లో కొందరు భక్తులు నిర్వహించిన రామ్ దర్బార్ కార్యక్రమం కూడా ఆహుతులను విశేషంగా అలరించింది. అనంతరం, స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది భారత సంతతి వారు పాల్గొని రామనామస్మరణలో తరించారు.
