బ్రూనై తెలుగు సంఘం ఆధ్వర్యంలో భారత 79వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అసోసియేషన్‌కు చెందిన సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌కు చెందిన చిన్నారులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి పాటలతో కూడిన నృత్యాలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడి భారత హైకమిషనర్ రాము అబ్బగాని కొత్తగా ప్రారంభించిన హైకమిషన్ భవనంలో భారత రాష్ట్రపతి ప్రసంగాన్ని వినిపించి, మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.


ఈ సందర్భంగా బ్రూనై తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకటరమణారావు మాట్లాడుతూ ఈ చారిత్రక వేడుకల్లో భాగం కావడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇది మన యువతరంలో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా భారత్, బ్రూనై మధ్య సాంస్కృతిక సంబంధాలను సైతం బలోపేతం చేస్తుందన్నారు. భారతదేశ గొప్ప వారసత్వాన్ని విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్య, సామాజిక కార్యక్రమాలకు తమ అసోసియేషన్ ఎప్పటికీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
















