అమెరికా కు భారత్ షాకిచ్చింది. అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలకు భారత్ తాత్కాలికంగా బ్రేకులు వేసింది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలను విధించడంతో ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. భారత్ తాజాగా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. భారత సైన్యం కోసం స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులతోపాటు, నౌకాదళం కోసం ఆరు బోయింగ్ పీ-8I గూఢచార విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి.
















