రష్యా సైనికుల తీరు గురించి కొన్ని విచిత్రమైన విషయాలను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిని జపరోవా వెల్లడించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో జపరోవా మాట్లాడుతూ యుద్ధం సందర్భంగా రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజల నివాసాల్లో చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారి ఇండ్లలో దొరికిన వస్తువునల్లా దోచుకుపోతున్నారని ఎమిని జపరోవా విమర్శించారు. ఎత్తుకెళ్లిన వస్తువులను వారి ఇండ్లకు పంపిస్తున్నారని చెప్పారు. ఆఖరికి ఉక్రెయిన్ వాసుల నివాసాల్లోని టాయిలెట్ కుండీలను కూడా రష్యా సైనికులు విడిచిపెట్టడం లేదని అన్నారు. రష్యా సైనికులు తమ భార్యలు, తల్లులతో మాట్లాడిన కొన్ని ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియోలు లభ్యమయ్యాయని, వాటిని తాము విన్నామని, ఆ ఆడియోల్లో ఉక్రెయిన్ నుంచి ఏం దొంగిలించాం? ఇంకా ఏమేం దొంగిలించబోతున్నాం? అనే విషయాల గురించి మాట్లాడుకున్నారని జపరోవా చెప్పారు. అదేవిధంగా ప్రపంచంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని ఆమె కొనియాడారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు కృషి చేయాలని కోరారు.


