భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జపాన్‌లోని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒసాకా ఎక్స్‌పోలో కవాతు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఒసాకా ఎక్స్‌పో హాల్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆహూతులను అలరించారు. జపాన్ కళాకారుల ఆధ్వర్యంలో భారతీయ కళా వారసత్వాన్ని కళ్లకు కట్టేలా చూపిన ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. భారత్, జపాన్‌ల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యం, పెరుగుతున్న సాంస్కృతిక బంధాన్ని ఈ వేడుక ప్రతిబింబించింది.

ఈ సందర్భంగా కాన్సాయ్ ఎకానామిక్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్‌ఈఐ చైర్మన్ అండ్ సీఈవో మసయోషి మట్సుమోటో అతిథులకు విందు ఏర్పాటు చేశారు. విందుకు ఫ్యూచర్ సిటీ ఇన్సియేటివ్ సెక్రటేరియట్ చీఫ్ అసిస్టెంట్ మాసాహిదె మోచిజుకి, సకాయ్ సిటీ మేయర్ హిదేకి నాగపూజి, షిగా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ ఓరీ కిషిమోటో, రాయబారి హెఈ సిజీ జార్జి, జనరల్ మేనేజర్ డాక్టర్ గరిమా మిట్టల్, పీబీఎస్ అవార్డు గ్రహీత మురళీధర్ మిరియాల సహా భారత ప్రతినిధి బృందం, సుమారు 100 మందికి పైగా జపాన్ ప్రముఖులు తరలివచ్చారు.
















