Namaste NRI

అమెరికాలో భారత సంతతి పైలట్‌ అరెస్టు

అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న భారత సంతతి పైలట్‌ రుస్తుమ్ భగ్వాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండవగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి మరీ నిందితుడిని అరెస్టు చేశారు. ప్రయాణికులు ఇంకా విమానం నుంచి దిగకమునుపే కాంట్రా కాస్టా కౌంటీ పోలీసులు, హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు విమానంలోకి దూసుకెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమను తోసుకుంటూ వాళ్లు లోపలకు వెళ్లారని ప్యాసెంజర్ ఒకరు తెలిపారు. అతడి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకొచ్చారని చెప్పారు.

ఈ ఘటనను చూసి నిందితుడి కోపైలట్ కూడా ఆశ్చర్యపోయారు. అతడిని అరెస్టు చేయబోతున్నట్టు తనకు అసలు తెలీనే తెలియదని చెప్పారు. భగ్వాగర్‌ను అరెస్టు చేయనున్న విషయం ఏరకంగా బయటపడినా అతడు తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పదేళ్ల చిన్నారిపై అతడు లైంగిక దాడి చేసినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని మార్టీనెజ్ డిటెన్షన్ సెంటర్‌లో పెట్టారు.  ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. అతడిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అస్సలు సహించబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.

Social Share Spread Message

Latest News