అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణించింది. నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటల్ క్యాంపస్‌లో మాస్టర్స్ ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం పట్ల ఒక పోలీస్ అధికారి చాలా చులకనగా, హేళనగా మాట్లాడాడు. ఆమె ప్రాణాలకు విలువలేదని సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగితో అన్నాడు. డేనియల్ నవ్వుతూ ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి అని తెలిపాడు. అలాగే మళ్లీ నవ్వుతూ ఒక చెక్ రాయండి. పదకొండు వేల డాలర్లకు అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ అన్నాడు.
కాగా, పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ మరో పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడిన ఈ సంభాషణ అతడి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. ఈ సంఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇది వైరల్ కావడంతో పోలీస్ అధికారి డేనియల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.