ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో భారత్‌కు చెందిన నవజీత్ సంధూ అనే 22 ఏళ్ల విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సాటి విద్యార్థులే అతడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవే అతని హత్యకు దారితీసింది. శ్రావణ్‌కుమార్ అనే విద్యార్థి తన రూమ్మేట్స్‌తో గొడవపడి నవజీత్ ఫ్లాట్‌కు వెళ్లాడని, తర్వాత అతని రూమ్మేట్‌కు ఫోన్ చేసి బయటికి రావాలని డిమాండ్ చేశారని, దాంతో శ్రావణ్ తనకు తోడుగా రమ్మనడంతో నవజీత్ వెళ్లాడని జితేందర్ సంధూ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌పై కత్తితో దాడి చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నవజీత్ పొడిచారని వెల్లడించారు.
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరుల మధ్య జరిగిన గొడవ పెద్దదై తన కొడుకు ప్రాణాల మీదికి తెచ్చిందని నవజీత్ తండ్రి జితేందర్ సంధూ చెప్పారు. తమకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నవజీత్ మిత్రులు ఫోన్ చేశారని, నవజీత్ మరణించాడని చెప్పారని అన్నారు. నవజీత్ తోటి విద్యార్థులే గొడవపడి మధ్య అడ్డుకోబోయిన తన కొడుకును చంపేశారని విలపించారు. కాగా తన కొడుకు మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా భారత్‌కు రప్పించాలని జితేందర్ సంధూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
నవజీత్ సంధూ 2022 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి చదువుకుంటున్నాడు. ఇంతలో ఇలా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, నవజీత్‌ను పొడిచిన అనంతరం నిందితులు పారిపోయారని, వాళ్ల కోసం గాలిస్తున్నామని మెల్‌బోర్న్ పోలీసులు చెప్పారు. నిందితులు నవజీత్ ఛాతిపై మూడు సార్లు పొడిచారని తెలిపారు.