అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన గోల్డ్ కార్డ్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాదరణ పొందిన నాన్ ఇమిగ్రెంట్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం భారతీయ ప్రతిభావంతులు చూస్తున్నారు. అమెరికా రెసిడెన్సీ పొందడానికి సత్వర మార్గమనే హామీని గోల్డ్ కార్డ్ ఇస్తుండటంతో భారతీయుల నుంచి విచారణలు 30-40 శాతం మేరకు పెరిగాయి. వీరిలో సంపన్నులు ఎక్కువగా ఉన్నారు. గోల్డ్ కార్డ్ జారీ కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ ఈ నెల 19న సంతకం చేశారు. 1 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును కొనుక్కోవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం గల మిడ్ కెరీర్ టెక్ ప్రొఫెషనల్స్ గోల్డ్ కార్డ్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

వ్యక్తిగతంగా 1 మిలియన్ డాలర్లు లేదా కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ ద్వారా 2 మిలియన్ డాలర్లు అమెరికా ఖజానాకు బహుమతి గా ఇచ్చేవారికి గోల్డ్ కార్డు వస్తుంది. ఈ సొమ్మును తిరిగి చెల్లించరు. ఇది ఈబీ5 మాదిరిగా పెట్టుబడి ఆధారిత వీసా కాదు. ఈ సొమ్మును అమెరికన్ వాణిజ్య, పరిశ్రమలకు ఇచ్చే కంట్రిబ్యూషన్‌గా పరిగణిస్తారు. ఇప్పటికే 2.5 లక్షల మంది ఆసక్తి చూపుతున్నారని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చెప్పారని సింఘానియా అండ్ కో మేనేజింగ్ పార్టనర్ రోహిత్ జైన్ తెలిపారు.
















