Namaste NRI

తెలంగాణ లోని 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు

తెలంగాణలో రాష్ట్ర  ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మొజం జాహీ మార్కెట్ లు ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డుల’ను అందుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఇనుమడించిందని సీఎం తెలిపారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతున్నదని సీఎం స్పష్టం చేశారు. అందుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16న లండన్ లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి అందచేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events