పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళికను ఇరాన్ ముందు ఉంచారు. తమ షరతులకు ఒప్పుకొంటే, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తేస్తామని, విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తామని ప్రతిపాదించారు. అయితే అమెరికా ప్రతిపాదనను సమీక్షించిన ఇరాన్ షరతులు తమకు ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనకు తమ ప్రాథమిక స్పందన సానుకూలంగా లేదని, అయినప్పటికీ షరతులపై సమీక్ష కొనసాగుతుందని ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు.

యుద్ధం ఎప్పుడు ముగించాలో నిర్ణయం తీసుకునే అధికారం ఇరాన్‌కు మాత్రమే ఉందని ఆ అధికారి స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు సమయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించడానికి ఇరాన్ అనుమతించదని ఆయన తెగేసి చెప్పారు. కొన్ని షరతులు పూర్తిగా నెరవేరినపుడు మాత్రమే దాడులను ఆపడానికి అంగీకరిస్తామని ఆయన తెలిపారు. సహజ న్యాయ హక్కు అయిన హొర్ముజ్ జలసంధిపై తమ దేశానికి సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, యుద్ధ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో, చెప్పాలని వంటి కొన్ని కీలక డిమాండ్లను ఇరాన్ తెరపైకి తెచ్చింది.















