అమెరికాకు చెందిన టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ ఇరుగుపొరుగు దేశాల్లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉన్నదని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సైనిక అవసరాల కోసం సహాయమందిస్తున్న అమెరికన్ బడా టెక్ కంపెనీల జాబితాను ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్నట్లు తెలిసింది.

ఆ జాబితాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, పలాంటీర్ టెక్నాలజీస్, ఐబీఎం, ఎన్‌వీడియా, ఒరాకిల్ కార్పొరేషన్ వంటి టెక్ దిగ్గజాలు ఉన్నట్టు తెలిపింది. ఇరాన్ కొత్త లక్ష్యాలు ఈ ప్రదేశాలు కావొచ్చని పేర్కొన్నది. ఈ టెక్ కంపెనీలకు చెందిన కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఇజ్రాయెల్‌తోపాటు పలు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థలు సైనికపరంగా అమెరికా, ఇజ్రాయెల్‌కు సహాయపడుతున్నట్టు ఇరాన్ అనుమానిస్తున్నది. ఇవే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామని, శుత్రువులు ఇందుకోసం తమకు స్వేచ్ఛ కల్పించారని ఇరాన్ తెలిపింది.















