ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తన తండ్రికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆమె ఈ సారి ఏకంగా కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి క్షిపణి శాస్త్రవేత్తలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు బయటి ప్రపంచానికి విడుదలవడంతో కిమ్ తరవాత పాలనాపగ్గాలు చేపట్టేది ఆమె అన్న చర్చలు ఊపందుకున్నాయి. తొమ్మిది నుంచి పదేళ్ల మధ్య వయసుండే కిమ్ రెండో కుమార్తె చువేయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఫొటోలు వారం క్రితం విడుదలయ్యాయి. తాజా వాసుంగ్`17 క్షిపణిని రూపొందించడంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి కిమ్, చువేయ్ ఉన్న ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇవి కిమ్ పరిపాలన వారసత్వ అంశాన్ని తెరలేపాయి. కిమ్ ముగ్గురు సంతానం. వారిలో మొదటి సంతానం కుమారుడు, రెండో సంతానం కుమార్తె అని తెలిసింది. రెండో కుమార్తె గురించి మాత్రం ఎక్కడ చర్చ జరగలేదు. ఇటీవల విడుదలైన ఫొటోలతో చువేయ్ ఆయన రెండో కుమార్తె అని స్పష్టమవుతోంది. తన కుటుంబ సభ్యులను బాహ్య ప్రపంచానికి చూపడానికి కిమ్ జోంగ్ ఉన్ ఇష్టపడడు. ప్రస్తుతం తన రెండో కుమార్తెతో బయటకు కనిపిస్తుండటంతో ఇక ఆమెనే కిమ్ వారసురాలు అని చర్చ జరుగుతోంది.














