ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రాటి క్ పార్టీ తరఫు నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో బైడెన్‌కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పార్టీతో సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం బైడెన్ పోటీపై మౌనం వీడారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ అధ్యక్షుడితో మనం నవంబర్ ఎన్నికల్లో గెలవడం కష్టమే. ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ ఓడిపోతాం. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. బైడెన్ గెలుపుపై పార్టీలో ఎవరికీ ఆశలు లేవు. చట్ట సభ్యులు, గవర్నర్లు అందరూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి బైడెన్ తప్పుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు అని తెలిపారు.