అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితానికి తెరరూపాన్నిస్తూ రూపొందిన బయోపిక్ ఘంటసాల దిగ్రేట్. కృష్ణచైతన్య టైటిల్ రోల్ పోషించారు. ఘంటసాల సతీమణి సావిత్రిగా కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్ రామారావు దర్శకుడు. సీహెచ్ ఫణి నిర్మాత. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం లో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఘంటసాలను శతాబ్ది గాయకుడు అంటారు. సంగీతం ఉన్నంతకాలం ఆయన జనహృదయాల్లో ఉంటారు. భగవద్గీత గానాన్ని ప్రపంచానికి అందించిన తొలి తెలుగు స్పూర్తి ఘంటసాల. భావితరాలకు ఆయన ఆదర్శ ప్రాయుడు. వారి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాను వీక్షించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆర్థిక దృక్కోణంతో కాకుండా, సామాజిక చైతన్యం కలిగించేందుకు, ఒక సుమధుర గాయకుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలనే గొప్ప తలంపుతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఘంటసాలగా నటించిన కృష్ణచైతన్యనూ, శ్రీమతి ఘంటసాలగా నటించిన మృదులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
ఈ సినిమాతో ఈ టీమ్ జన్మ ధన్యమైందని, ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని, అలాగే ఎన్టీఆర్కు కూడా భారతరత్న ప్రకటించాలని నట, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఇంకా దర్శకుడు సీహెచ్ రామారావు కూడా మాట్లాడారు. సుమన్, సుబ్బరాయశర్మ, దీక్షితులు, మాస్టర్ అతులిత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: వాసురావు సాలూరి.