అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో హెడ్‌లైన్స్‌లోకెక్కిన బైడెన్, ఇప్పుడు మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అనబోయి, ఉపాధ్యక్షుడు ట్రంప్ అని సంభోదించారు. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా? అని విలేకరులు బైడెన్‌ను ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు సమాధానమిస్తూ అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదు అంటూ బదులిచ్చారు. అక్కడ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనకుండా ట్రంప్ అనడంతో ఇప్పుడు బైడెన్ మానసిక పరిస్థితి మరోసారి చర్చకు దారితీస్తోంది.