కన్నడ హీరో ఉపేంద్ర నటించిన చిత్రం కబ్జ. ఈ మూవీ రిలీజ్ అయి అట్టర్ ప్లాప్ గా నిలిచింది. గతనెల 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. వారంలోపే సినిమా దుకాణం సర్దేసింది. ఇక నెల తిరక్కుండానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. కన్నడలో రికార్డులు కొల్లగొట్టిందా అంటే అదీ లేదు. మూడు రోజుల్లోనే వంద కోట్లు అంటూ పోస్టర్ వేయించి ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యారు. ఇంత జరిగినా దర్శక, నిర్మాతలు తగ్గేదేలే అంటున్నారు. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కబ్జ-2ను స్టార్ట్ చేస్తున్నట్లు ఏకంగా పోస్టర్‌నే రిలీజ్ చేశారు.
మొదటి పార్టులో హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించగా, సుదీప్, శివరాజ్ కుమార్‌లు కీలకపాత్రలో కొద్ది సేపు మెరిసారు. అయితే సెకండ్ పార్ట్‌లో మాత్రం శివరాజ్ కుమార్ హైలెట్ అయ్యేలా తెరకెక్కిస్తారట. మరీ ఈ సీక్వెల్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటారా లేదంటే కన్నడలోనే రిలీజ్ చేసి సేఫ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారంటే, ఈ సారి సెకండ్ పార్ట్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.