అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ఘోస్టీ. కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా, పోలీసాఫీసర్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఆత్మలకు, కాజల్ పోషించిన పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వినోదంతో పాటు ఆద్యంతం సస్పెన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది అన్నారు. ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే ఔత్సాహిక దర్శకుడి పాత్రలో యోగిబాబు కనిపిస్తారు. మణిరత్నం అసిస్టెంట్‌గా కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేసుకుంటాడు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్ దగ్గరకు వెళతారు. యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా తికమక పడుతారు. హీరోయిన్ అనుకుని దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను పోలీస్ అని చెబుతూ కాజల్ ఒక్కటి పీకడం వంటి సన్నివేశాలు ఉంటాయి. కె.ఎస్.రవికుమార్, రిడిన్ కింగ్‌స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడుకాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. త్వరలో ఘోస్టీ తెలుగు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.
