హాంకాంగ్‌లో కార్గిల్ విజయ్ దివస్ సురభి ఏక ఎహసాన్ కార్యక్రమం వైభవంగా ముగిసింది. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చిత్ర లేఖనం, హిందీలో కవితలు, గీత రచనల పోటీలు నిర్వహించారు. దేశం కోసం ఏమైనా చేయాలనే చిన్న నాటి కోరిక నెరవేర లేదని, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కాలేజీలో సీటు దక్కలేదని టోరీ వ్యాఖ్యాత జయ పీసపాటి తెలిపారు. ఆ కల సాకారం చేసే అవకాశం టోరీ రేడియో వ్యాఖ్యతగా లభిస్తుందని ఊహించలేదన్నారు.


తన రేడియో షో పేరు జై హింద్ అని, ఈ పేరు ఎంచుకున్నందుకు రెండు కారణాలు ఉన్నాయన్నారు. జై హింద్ లో అనేక హోదాల్లో పనిచేసిన విశ్రాంత సైనికులు, వీర నారీలతో పరిచయాలు, త్రిదళాల కుటుంబాలకు సేవలు అందజేసే స్వచ్చంద సేవా సంస్థలతో పరిచయాలు చెయ్యడం జరిగిందన్నారు. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధంలోనూ సేవలు అందించిన వారున్నారన్నారు.


కార్గిల్ విజయ్ దివస్ సురభి ఏక ఎహసాన్ ప్రారంభించి తొమ్మిది ఏళ్లు అయిందన్నారు. తన రేడియో షో ముఖ్య ఉద్దేశం సైనికుల జీవితాలను వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమన్నారు. అందుకు టోరీ రేడియో యాజమాన్యం, శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు. ఆ స్ఫూర్తితో పుష్కర కాలంగా జై హింద్ షో చేస్తున్నట్లు జయ పీసపాటి తెలిపారు. ఈ ఏడాది సురభి ఏక ఎహసాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు, మన జాతీయ భాష హిందీలో కవితలు, గీత రచనల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ సురభి గోయల్, భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు వచ్చారు. టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా సురభి గోయల్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులను ఒక తాటి పైకి తీసుకొచ్చి దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు. అనంతరం పిల్లలు,పెద్దలు సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు, నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను సురభి అందజేశారు.
















