భారత పాస్‌పోర్ట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైన పీఎస్పీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డాటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఇది సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు వర్ణపు చిన్న సింబల్ ఉంటుంది. సంప్రదాయ పాస్‌పోర్ట్‌లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీతో ఈ-పాస్‌పోర్ట్ అనుసంధానమై ఉంటుంది. పాస్‌పోర్ట్ కవర్‌లో చిప్, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్‌లోనే పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అథెంటికేషన్ సులభతరం అవుతుంది.

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్ సేవలు హైదరాబాద్ సహా 13 నగరాల్లో మాత్రమే అందుతున్నాయి. అయితే, ఈ ఏడాది ప్రథమార్థం ముగిసే నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో ఈ సేవ లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
