ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్‌లో భారీ వినాయకుడు కొలువు తీరనున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణేష్ విగ్రహాలలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఒకటి. పది రోజుల పాటు కొనసాగే గణేష్ చతుర్ధి వేడుకల్లో వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారు. అయితే ఖైరతాబాద్ బడా గణేశ్ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. గణేశ్ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయ మండపం వద్ద కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గతేడాది కొవిడ్ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 10కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.