బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా మల్ ఔర్ మీనా పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. హిందీ కవి, దర్శకుడు కమల్ అమ్రోహితో మీనా కుమారి ప్రేమాయణం మొదలుకొని వారి విఫల దాంపత్య జీవితం వరకు జరిగిన ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించనుందని తెలిసింది. ఇటీవలకాలంలో దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా సోషల్‌మీడియా పోస్ట్‌లకు వరుసగా స్పందిస్తున్నది కియారా అద్వాణీ. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మొదలుకొని వివిధ ప్రచార చిత్రాలు అద్భుతమంటూ ప్రశంసించింది. ఈ నేపథ్యంలో మీనా కుమారి పాత్రలో కియారా అద్వాణీ నటించడం దాదాపు ఖాయమైందని, చిత్ర బృందం సైతం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపాయని బాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.