కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రూల్స్ రంజన్. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది .సమ్మోహనుడా లిరికల్ వీడియోని చిత్ర బృందం చేసింది. నాయకానాయికలపై చిత్రీకరించిన శృంగార గీతమిది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. నాయకానాయికలకు ఒకరిపై ఒకరికున్న మోహాన్ని తెలియజేస్తూ నిప్పు, నీరు నేపథ్యంలో పాటను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటోంది.
అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లేకా అద్భుతంగా ఉంది. ఇక ఈ పాటకి గీత రచయిత రాంబాబు గోసాలతో కలిసి దర్శకుడు రత్నం కృష్ణ సాహిత్యం అందించడం విశేషం. పాట సందర్భానికి తగ్గట్టుగా వారు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా. ఇష్టసఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా అంటూ నాయిక తన ప్రియుడైన కథానాయకుడికి తన దేహాన్ని అర్పిస్తానని పాడుతున్నట్టుగా పాట ప్రారంభమైంది. సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా. మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా వంటి పంక్తులలో పాట ఎంతో అందంగా సాగింది. ఇక ఈ పాటని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఆలపించారు. ఆమె తన గాత్రంతో పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఈ పాటకి శిరీష్ నృత్య రీతులు సమకూర్చారు.