ఆఫ్రికా దేశమైన నైజర్‌ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని అక్కడున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని కోరింది. నైజర్‌లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక సూచన జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్ని తెలిపారు. నైజర్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించారు.
కాగా, ప్రస్తుతం నైజర్ గగనతలాన్ని మూసివేశారని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల గుండా వెళ్లే వారు భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని కోరారు. నైజర్‌లో సుమారు 250 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారంతా భారత ఎంబసీలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. భారతీయులు సురక్షితంగా ఆ దేశాన్ని వీడేందుకు భారత ఎంబసీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.