రెండు లక్షల ఏండ్ల క్రితం యూరప్‌లో ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడని ఇప్పటి వరకు పరిశోధకులు భావించారు. కానీ ఆ కాలానికి 50 వేల ఏండ్ల పూర్వమే ఆది మానవు డు నిప్పును కనుగొన్నాడని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. స్పెయిన్‌లోని చారిత్రక ప్రదేశంలో ఆది మానవుడి నిప్పు వాడకంపై ఆధారాలు లభ్యమయ్యాయని స్కాట్లాండ్లోని హిరియట్ వాట్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. నిప్పు కనుగొనడం మానవ చరిత్రలో అత్యంత కీలకమైంది. అయితే నిప్పుతో మానవుడికి పరిచయం ఎప్పుడు ఏర్పడిదందనే విషయమై ప్రపంచవ్యాప్తంగా భిన్న వాదనలున్నాయి. దక్షిణాఫ్రికాలోని ఓ గుహలో జంతు అవశేషాలపై కార్బన్ డేటింగ్ జరపగా, అవి 15 లక్షల ఏండ్ల క్రితం నాటివని తేలింది. రెండు రాళ్లను రాపిడి చేస్తూ నిప్పును పుట్టించటం అనేది తొలిసారిగా 7.9 లక్షల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్‌లో జరిగిందని పురావస్తు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే నిప్పును నియంత్రిస్తూ కట్టెల్ని కాల్చే ప్రక్రియ ఎప్పుడు మొదలైందన్న దానిపై ఇప్పటివరకూ కచ్చితమైన ఆధారాలు లేవు. పురావస్తు శాఖ రికార్డుల్లోనూ ఇదొక అసంపూర్ణ భాగంగా మిగిలిపోయింది.


