కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరోమారు కొవిడ్ 19 డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొదటిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదైన చైనా సెంట్రల్ సిటీ అయిన వుహాన్ మరోమారు లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోని ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్షల మంది నివసించే శివారు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. కోవిడ్ పట్ల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. సామూహిక పరీక్షలు, కఠినంగా ఐసోలేషన్ అమలు చేయడం, స్థానికంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయినా చైనా అమలు చేస్తున్న కోవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.














