అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్‌పై మిషెల్ తాజాగా స్పందించారు. అలాంటి దేమీ లేదని విడాకుల వార్తలను కొట్టిపారేశారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్‌కాస్ట్‌లో నటి సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా సంభాషించారు. ఈ సందర్భంగా విడాకులపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను వ్యక్తిగత విషయాల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని, అందుకే అధికారిక, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకుంటున్నారు. నేను మాత్రం నాకు ఏది మంచో అదే చేయాలనుకుం టున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది నేను చేయను అని మిషెల్ చెప్పుకొచ్చారు.
