ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్-2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్, ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ప్రయత్నం లోనే ఫాతిమా విశ్వసుందరిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చారు. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 120 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొనగా, వారందరినీ వెనక్కినెట్టి ఈ 25 ఏళ్ల భామ అందాల కిరీటాన్ని దక్కించుకుంది.

ఇక తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడినట్లు ఫాతిమా గతంలో తెలిపారు. వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన మిస్ యూనివర్స్ మెక్సికో 2025 పోటీల్లో విజేతగా నిలిచారు.















