తెలంగాణకు చెందిన 23 ఏళ్ల అమ్మాయి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమ్యారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. హైదరాబాద్‌కి చెందిన నితీషా కాల్ స్టేట్ యూని వర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. మే 28, 2024 నుంచి అమెరికాలో కనిపించకుండా పోయింది.

ఈ ఘటనకు ముందు ఇటీవల అమెరికా చికాగోలో 25 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి కూడా అదృశ్యమయ్యాడు. ఇతను విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. దీనికి ముందు అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అదృశ్యమయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు. ఇలా తప్పిపోయిన ఘటనలే కాకుండా రోడ్డు ప్రమాదాల్లో కూడా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది బిజినెస్ అనాలిసిస్‌లో మాస్టర్స్ చేస్తున్న 24 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థిని ప్రతీక్షా కున్వర్ అమెరికా లోని కాన్సాస్‌లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. అక్టోబర్ 15 రాత్రి ప్రతీక్ష, తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవల కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, ఇతర కారణాల వల్ల దాడులకు గురికావడం, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.