జూన్ 25న బ్రిటన్ రాజధాని లండన్లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలోబోనాల జాతర జరుగనుంది. వెస్ట్ లండన్లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు.


టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. యూకేలో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tauk.org.uk వెబ్సైట్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
