తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలు కవిత అని ప్రశంసించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, మహిళల హక్కులపై పోరాటం చేస్తున్న ధీరవనిత, అలాంటి నాయకురాలిపై ప్రస్తుత కేంద్రం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాల తమ వెంట ఉంటూ ప్రోత్సహిస్తున్న కవిత వెంటనే తామంతా ఉంటామన్నారు. కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే ధీర వనిత కవిత అని కొనియాడారు. ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళా బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నామన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్టసభల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా వీ స్టాండ్ విత్ కవిత అక్క అంటూ నినదించారు. కార్యక్రమంలో మమతా, క్రాంతి, స్నేహ, శ్వేతా, మౌనిక, హారిక రెడ్డి, పావని కడుదుల, నందిని, స్వాతి బుడగం, తదితరులు పాల్గొన్నారు.
