
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని, ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. . రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. అమెరికా పదేపదే తిడుతున్నా కూడా అవేవీ పట్టించుకోకుండా వారిని అభినందిస్తూ శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో జరిగిన గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదు అని రాహుల్ పేర్కొన్నారు.
















