అమెరికా సందర్శించాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను తిరస్కరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పవిత్ర మహాప్రభు భూమికి తిరిగి రావాలన్న ఉద్దేశంతో అలా చెప్పానన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ తొలి ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడకు రావడం కోసమే అమెరికా సందర్శించాలన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను తిరస్కరించినట్లు తెలిపారు.

కాగా, రెండు రోజుల క్రితం జీ7 శిఖరాగ్ర సమావేశం కోసం తాను కెనడాలో ఉన్నట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. మీరు కెనడా వచ్చారు కాబట్టి, వాషింగ్టన్‌కు రండి. మనం కలిసి విందు చేసి మాట్లాడుకుందామని ఆయన అన్నారు. అయితే ట్రంప్ ఆహ్వానానికి నేను ధన్యవాదాలు చెప్పా. మహాప్రభువు భూమికి వెళ్లడం నాకు చాలా ముఖ్యం. అందుకే ట్రంప్ ఆహ్వానాన్ని మర్యాదగా తిరస్కరించా. మహాప్రభు పట్ల మీకున్న ప్రేమ, భక్తి ఈ భూమికి నన్ను తీసుకువచ్చాయి అని మోదీ అన్నారు.
