ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ దౌత్య పరిస్థితిని చర్చించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు హృదయపూర్వక మద్దతు ఇచ్చిన మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రష్యా దాడులపై మోదీకి వివరించినట్లు చెప్పారు. రష్యా సైన్యం ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలను ఎలా లక్ష్యంగా చేసుకుంటుందో చెప్పారు. డజన్ల కొద్దీ జనం గాయపడిన జపోరిజియా బస్ స్టేషన్‌పై దాడిని సైతం ప్రస్తావించారు.

సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశమయ్యేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇటీవల పరిణామాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రష్యాతో వివాదాన్ని, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
















