మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్ అలియాస్ ఎల్ మెంచో మెక్సికన్ సైన్యం కాల్పుల్లో మరణించాడు. జాలిస్కోలోని తపల్పా సమీపంలో ఒసెగుయెరా సెర్వాంటెస్‌ను పట్టుకోవడానికి జరిగిన ఆపరేషన్‌లో గాయపడ్డాడు. మెక్సికో నగరానికి తరలిస్తుండగా సెర్వాంటెస్ మరణించాడని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో సెర్వాంటెస్ కూడా ఉన్నాడు. మరో ఇద్దరిని అరెస్టు చేసి సాయుధ వాహనాలు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

ముగ్గురు సైనిక సిబ్బంది కూడా ఈ ఆపరేషన్‌లో గాయపడ్డారని, వారికి వైద్య చికిత్సలు జరుగుతున్నాయని మెక్సికన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఎల్ మెంచోను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీపడుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ అన్ని విషయాల్లో తామే గెలుస్తున్నామని, ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం న్యాయం కాదని చమత్కరించారు.















