అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో సమావేశమైన రోజుల వ్యవధిలోనే టెస్లా సంస్థ భారత్లో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో రెండు షోరూమ్లు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత్లోకి టెస్లా ప్రవేశించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మస్క్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, ఇది అన్యాయమే అంటూ వ్యాఖ్యానించారు.
ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలోని ప్రతీ దేశం తమను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. సుంకాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మస్క్ భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారని, ఆయన వరకు అది మంచి విషయమే కావొచ్చన్నారు. కానీ, అమెరికా పరంగా చూస్తే మస్క్ నిర్ణయం చాలా అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించారు. మస్క్ ముందే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
