2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైనవని, ప్రవాసాంధ్రులు బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రవాస తెలుగువారితో ఆయన జూమ్ కాల్‌లో మాట్లాడారు. అనేక విషయాలను చర్చించారు. పలువురు ఎన్నారైలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకొని వారికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు అందరూ భారతదేశం వచ్చి ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎన్నో కష్టాల్లో మునిగిపోయిందని, అధికారంలోకి వచ్చాక జగన్ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. అభివృద్ధి లేని పాలన ఈ ఐదేళ్లలో అందరూ చూశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్ పాలన ఉందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రులకి ఒక గుర్తింపు ఉండేదని, ఇప్పుడు సౌత్ ఇండియాలోని బీహార్ లాగా రాష్ట్రం తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. బటన్ నొక్కడం ఒక్కటే ముఖ్యమంత్రి బాధ్యత కాదని, అభివృద్ధి కూడా చేయాలని నారా లోకేశ్ హితవు పలికారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన అన్నింట్లోనూ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉందని అన్నారు. పక్క రాష్ట్రం నుంచి రావడానికి కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవని విమర్శించారు. విద్యుత్ కోతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని వ్యాఖ్యానిం చారు. నాణ్యత లేదు, పరిశ్రమలు రాలేదు, ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం ప్రజలకు భారం అవుతుంది అని అన్నారు.
చేయని తప్పుకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 53 రోజులు రాజమండ్రి జైలులో బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు ఎన్నారైలు అందుకొని, పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. 2024 ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కీలకమైనవి చెప్పారు. అందరూ బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించాలనే దానిపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించా రు. ఇన్ఫ్లుయెన్సర్‌లతో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఎవరి నియోజక వర్గంలో వారు బాధ్యతలు తీసుకొని విధులను నిర్వహించాలని చెప్పారు.
రాబోయే 42 రోజులు పార్టీకి ఎంతో కీలకమైనవని లోకేశ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ పార్టీ వలన ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆ పార్టీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. ఎన్నారైల కోసం గతంలో ఏపీఎన్ఆర్‌టీ స్థాపించి దాని ద్వారా ఎన్నో రకాల సేవలను, ఆస్తుల కబ్జా సమస్యలు, ఫ్యామిలీ కేర్, టీటీడీ దర్శనం టికెట్లు వంటి సేవలు ఎంతో విజయవంతంగా అందించామని అన్నారు. రేపు పార్టీ అధికారం లోకి వచ్చాక ఇంకా మెరుగ్గా ఆ సేవలతో పాటు మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తన వాట్సాప్ నంబర్‌కు ఏమైనా ఫీడ్ బ్యాక్ ఉంటే నేరుగా ఇవ్వాలని నారా లోకేశ్ కోరారు. ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డా. రవి వేమూరుతో పాటు దాదాపు వెయ్యి మంది వరకు ఈ జూమ్ కాల్‌లో పాల్గొన్నారు. గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రవి రాధాకృష్ణ ఈ జూమ్ కాల్‌కు సమన్వయకర్తగా వ్యవహరించారు.