నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బారీ విల్మోర్ బోయింగ్‌కు చెందిన స్పేస్‌షిప్‌లో ఇంటర్‌నేషనల్ స్పేస్‌స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. అయితే, ఇద్దరు వ్యోమగాములు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కీలక ప్రకటన విడుదల చేసింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో వెళ్లిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసిన సమయంలో ఉన్న ఆప్షన్‌ను పరిశీలించినట్లు నాసా తెలిపింది. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను స్టార్‌లైనర్ జూన్ 5న ఇంటర్‌నేషనల్ ఐఎస్‌ఎస్‌కు తీసుకు వెళ్లింది. ఎనిమిది రోజుల మిషన్‌ను పూర్తి చేసుకొని మళ్లీ భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే, హీలియం లీక్‌తో పాటు థ్రస్టర్ లోపం కారణంగా వ్యోమగాములు తిరిగి రావడం వాయిదాపడింది.
బోయింగ్ సంస్థకు ఇదే తొలి మిషన్. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ రెండు నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీరిని తిరిగి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఇద్దరు 2025 ఫిబ్రవరిలో మాత్రమే భూమిపైకి తిరిగి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా నాసా పేర్కొంది.