రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఎస్.శంకర్ దర్శకత్వం. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికా డల్లాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు సుకుమార్ అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రంగస్థలం కు రామ్‌చరణ్ జాతీయ అవార్డు తీసుకుంటాడని ఆశించా. కానీ రాలేదు. అయితే గేమ్ చేంజర్ ైక్లెమాక్స్ చూశాక, ఈ సినిమాలోని రామ్‌చరణ్ నటనకు పక్కాగా జాతీయ అవార్డు వస్తుందనిపించింది అని తెలిపారు.
మా సంస్థలో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీయడం ఇదే ప్రథమం. శంకర్‌గారి సినిమా సెల్‌ఫోన్‌లో చూస్తే ఫీల్ రాదు. దాన్ని బిగ్ స్క్రీన్‌పైనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ అంశాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. శంకర్‌గారు అన్నీ తానై నడిపించారు. ఈసారి మామూలుగా కొట్టడంలేదు. గట్టిగా కొట్టబోతున్నాం అని దిల్‌రాజు నమ్మకం వ్యక్తం చేశారు. శంకర్ మాట్లాడుతూ పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా సినిమా చేయాలి, కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలి అనుకొని ఈ గేమ్‌ఛేంజర్ చేశాను. ప్రభుత్వోజ్యోగి, పొలిటీషియన్ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. రామ్‌చరణ్ సెటిల్డ్‌గా చేశాడు. పంచెకట్టులో అప్పన్నగా అదరగొట్టేశాడు. ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. రేపు ఆ కష్టాన్ని తెరపై చూస్తారు అని శంకర్ చెప్పారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ శంకర్‌గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్‌కు సచిన్ ఎలాగో, ఇండియన్ సినిమాకు శంకర్‌గారు అలా. అలాంటి శంకర్‌గారితో పనిచేయడం నా అదృష్టం. నానుంచి సోలో ఫిల్మ్ వచ్చి అయిదేళ్లయింది. ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపరచదు అని అన్నారు. ఇంకా అంజలి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ బుచ్చిబాబు, ఎస్‌జే సూర్య కూడా మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా జనవరి 10న విడుదల కానుంది.