పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (73) ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్‌కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమించినట్లు కేబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కొనసాగుతాయని వివరించింది.
ప్రధాని షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తెను దార్ కుమారునికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. షరీఫ్ కుటుంబానికి సన్నిహితుడైన డార్ గతంలో రెండు సార్లు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. షెహబాజ్ షరీఫ్ ఈసారి ఆయనకు విదేశాంగ శాఖను అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ ఏడాది జరిగిన పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ ) మద్దతుతో షెహబాజ్ షరీఫ నేతృత్వంలో పీఎంఎల్ (ఎన్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.