భారత్, యూకేలు సహజ భాగస్వాములని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత వృద్ధి చెంది, ప్రపంచ సుస్థిరతకు, ఆర్థికాభివృద్ధికి మూల స్తంభంగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ భేటీ అయ్యారు. నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం స్టార్మర్, మోదీ మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్, యూకేల భాగస్వామ్యం అత్యంత నమ్మకమైందని, ఇది ప్రతిభ, సాంకేతికతతో ముందుకు వెళ్తోందని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, తాను కలిసి పనిచేస్తామన్నారు.


భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని స్టార్మర్ గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో సుంకాలు భారీగా తగ్గిపోతాయన్నారు. ఇరుదేశాల మార్కెట్లలో పరస్పర వాణిజ్యం పెరుగుతుందని, పెద్దఎత్తున ఉద్యోగావకాశాలూ లభిస్తాయని చెప్పారు. 2028 కల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రధాని మోదీకి, ఆయన నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన అంశంపైనా తాము చర్చించినట్లు చెప్పారు. వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల తేలికపాటి క్షిపణి వ్యవస్థలను భారత సైన్యానికి సరఫరా చేయనున్నట్లు బ్రిటన్ అధికారులు చెప్పారు. భారత నౌకాదళానికి అవసరమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై ఇరుదేశాల మధ్య రూ.4151 కోట్ల ఒప్పందం జరిగినట్లు తెలిపారు.

భారత్‌లో కొత్తగా తొమ్మిది బ్రిటన్ యూనివర్సిటీల క్యాంప్‌సలను ఏర్పాటు చేయనున్నట్లు స్టార్మర్ ప్రకటించారు. గురుగ్రామ్‌లో యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ క్యాంప్‌సను ప్రారంభించగా, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లాంకెస్టర్, యూనివర్సి టీ ఆఫ్ సర్రే క్యాంప్‌సలు కూడా ప్రారంభించనున్న ట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, అబెర్డీన్, బ్రిస్టల్, లివర్‌పూర్, క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ కొవెంట్రీలు క్యాంప్‌సలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో అత్యధిక ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పిన దేశంగా బ్రిటన్ నిలవనుందన్నారు.
















