
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించమని లక్షలాది అమెరికన్లు రోడ్లు, వీధుల్లో నినదించారు. ఆయనకు, ఆయన పరిపాలన, విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 50 రాష్ర్టాలలోని 2,500కు పైగా ప్రాంతాల్లో నో కింగ్స్ (రాజులు లేరు) నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ నిరంకుశత్వాన్ని తమ నిరసన సవాల్ చేస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. తన పాలనకు ఎదురులేదని ట్రంప్ భావిస్తున్నారని నో కింగ్స్ నిరసన నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికాలో రాజులు లేరు. అరాచకానికి, అవినీతికి, క్రూరత్వానికి మేము లొంగేది లేదు అని నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే ఇవి అమెరికా విద్వేష నిరసనలని కొందరు రిపబ్లికన్లు అభివర్ణించారు. నేషనల్ గార్డులను బయటకు రప్పించాల్సిన సమయం ఆసన్నమైందని కన్సాస్ సెనేటర్ రోజెర్ మార్షల్ చెప్పారు. ఇవి ఆంటిఫాతో ముడిపడిన ప్రదర్శనలు కావడంతో నేషనల్ గార్డు బలగాలు అవసరమని ఆయన తెలిపారు. నిరసనలు శాంతియుతంగా జరగాలని తాను ఆశిస్తున్నప్పటికీ అనుమానమేనని ఆయన వ్యాఖ్యానించారు.















