తాము అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాము అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జీవవైవిధ్య సదస్సు సందర్భంగా అర్మేనియా రాజధాని యెరెవాన్లో జార్జియా ప్రధాని ఇరాక్లీ కొబాఖిడ్జేతో పెజెష్కియాన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇరాన్ అణ్వాయుధాలపై తమ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. అణ్వాయుధాల అభివృద్ధిని నిషేధిస్తూ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో స్పష్టమైన వైఖరి తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉందని చెప్పారు.అయితే తమను లొంగదీసుకోవచ్చని అమెరికా భావిస్తోందని, బలవంతపు చర్యలకు తాము అంగీకరించబోమని పెజెష్కియాన్ స్పష్టంచేశారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మానవతా సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.















