Namaste NRI

సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

భారతదేశ గణతంత్ర దినోత్సవ వేళ  సింగపూర్‌లోని ఆర్యసమాజ్‌ ఆడిటోరియంలో జై ఎన్టీఆర్‌ టీమ్‌ సింగపూర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఈ వేడుకలు రమణీయంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి  ముఖ్య  అతిథులుగా  ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌ బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్‌, సినీ నటులు ఎం. మురళీమోహన్‌లు పాల్గొన్నారు. జై ఎన్టీఆర్‌ టీమ్‌ సింగపూర్‌ తరఫున రేణుకుమార్‌ కన్నెగంటి, సురేష్‌ మొద్దుకూరి, వెంకట్‌ భీమినేని, కరుణాకర్‌ కంచేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

దీప ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్‌ విగ్రహానికి అతిథులు పూలదండలు వేయడంతో కార్యక్రమం మొదలైంది. ప్రొ బి.వి.ఆర్‌. చౌదరి, వట్టికూటి శేషగిరి రావులు స్వాగతోపన్యాసం చేసి ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ రంగ విశేషాలను ప్రస్తావించారు.  అతిథుల పరిచయం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ చిత్రాల పాటలకు స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, యువతులు చేసిన నృత్యాలు, భరతనాట్యం మొదలైన కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి.ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ సభ్యులు భగీరథ సంపాదకత్వంలో వెలువరించిన తారకరామం పుస్తకాన్ని,  ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్దన్‌ ఎన్టీఆర్‌పై రూపొందించిన తెలుగువారి గుండెబలం వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు. 

ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్‌ ప్రసంగిస్తూ తనకు అన్నగారితో, తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్‌ తనను సొంత సోదరుడిగా ఆదరించారని చెబుతూ, ఎన్టీఆర్‌కు భారతరత్న లభిస్తే తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్‌ అభిమానులకు, తెలుగు వారికి సంతోషం కలుగుతుందన్నారు.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్దన్‌ ఉద్వేగభరితంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవ తారగా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ ముందు, ఆ తరువాత గా తెలుగునాట రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీని ఏర్పాటు చేశామని, ఎన్టీఆర్‌ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంధాలను వెలువరిస్తున్నామని అన్నారు. అందులో తారకరామం తాజాదని, భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చి ప్రోత్సహించిన ఎన్టీఆర్‌కు ఎంత చేసినా తక్కువే అన్నారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా తమ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. కాగా, తాము చేస్తున్న ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం, సహకారం ఉన్నాయని తెలిపారు.

నందమూరి రామకృష్ణ ప్రసంగిస్తూ ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవాడలో ఎన్టీఆర్‌ వజ్రోత్సవ వేడుకల్ని నభూతోన భవిష్యతి గా నిర్వహించిన ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్దన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ వేడుకల్ని నిర్వహించడానికి టి.డి.జనార్ధన్‌, అట్లూరి అశ్విన్‌లు చొరవ తీసుకోవడం తెలుగువారందర్నీ సమన్వయం చేసుకోవడం అభినందనీయమన్నారు. తన తండ్రి గారైన ఎన్‌.టి. రామారావు నుంచి తాము క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం వంటి ఉన్నత విలువలు నేర్చుకొన్నామని, ఆ మహోన్నత మూర్తికి కొడుకుగా జన్మించడం తన అదృష్టం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు సంఘాలన్నీ హాజరు కావడం విశేషం. కార్యక్రమాలలో పాల్గొని అలరించిన వారందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా మొమెంటోలు బహూకరించారు. జై ఎన్టీఆర్‌ టీమ్‌ సభ్యులు సర్వేష్‌, కురిచేటి కరుణాకర్‌లు వందన సమర్పణ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events